ఎజ్రా

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

యూదుల సాంప్రదాయం ఈ చారిత్రక పుస్తకం యొక్క రచనను శాస్త్రియు పండితుడును, యూదుల రెండవ సమూహమును బబులోను నుండి యెరూషలేమునకు తిరిగి నడిపించిన ఎజ్రాకు ఆపాదించింది (ఎజ్రా 7:11-26). ఎజ్రా 8 లో ఉత్తమ పురుషకు సంబంధించిన (ఫస్ట్-పర్సన్ రిఫరెన్స్) సర్వనామమైన "నేను" ఉన్నది గనుక రచయిత ఈ సంఘటనల్లో పాల్గొనడాన్ని సూచిస్తుంది. ఈ రచయిత పుస్తకం యొక్క రెండవ భాగంలోను, అలాగే దాని కడమకథ (సీక్వెల్) అయిన నెహెమ్యా పుస్తకంలోను ప్రధాన పాత్ర పోషిస్తాడు. హెబ్రీ బైబిల్లో, ఈ రెండు పుస్తకాలు ఒక రచనగా పరిగణించబడ్డాయి. అయితే ఇవి విడిగా వ్రాయబడి హెబ్రీ క్యానన్‌లో కలుపబడినట్లుగా (మరియు ఆంగ్ల అనువాదాలలో మళ్ళీ రెండుగా చేయబడ్డాయి) కొన్ని అంతర్గత సాక్ష్యాలు సూచిస్తున్నాయి.

ఎజ్రా ప్రధాన యాజకుడైన అహరోనుకు నేరుగా వారసుడు (7:1–5), అందువలన అతనే యాజకుడును శాస్త్రియునై ఉండటానికి అధికారముగలవాడు. దేవునిపట్ల మరియు ఆయన ధర్మశాస్త్రముపట్ల అతనికున్న ఆసక్తే పారసీక దేశపు సామ్రాజ్యం (యూదా జనులను చెరగొనిపోయిన బబులోను సామ్రాజ్యాన్ని జయించి ఆ ఖాళీని పారసీక సామ్రాజ్యం భర్తీ చేసింది) పై రాజుగా ఉన్న అర్తహషస్త పరిపాలనా కాలంలో యూదుల సమూహాన్ని ఇశ్రాయేలునకు తిరిగి నడిపించడానికి ఎజ్రాను ప్రేరేపించింది.

మనమెక్కడ ఉన్నాము?

డెబ్బది సంవత్సరాల బబులోనీయుల నిర్బంధము తరువాత నేరుగా రెండు వేర్వేరు కాలాలను ఎజ్రా పుస్తకం నమోదు చేస్తుంది. జెరుబ్బాబెలు నేతృత్వంలోని యూదులు చెరలోనుండి విడిపింపబడి తిరిగి రావడాన్ని ఎజ్రా 1–6 వివరిస్తుంది. ఇరవై మూడు సంవత్సరాల ఈ కాలం పారసీకదేశపు రాజైన కోరెషు యొక్క ఆజ్ఞ చాటింపు వేయడం దగ్గర మొదలై యెరూషలేములోని ఆలయ పునర్నిర్మాణముతో ముగుస్తుంది (క్రీ.పూ. 538–515). అరవై సంవత్సరాల తరువాత, ఎజ్రా చెరలోనున్న ఇశ్రాయేలు యొక్క రెండవ సమూహాన్ని (క్రీ.పూ. 458) నడిపించిన కథను ఎజ్రా 7-10 అందుకుంటుంది. క్రీస్తుపూర్వం 450 (ఈ సంవత్సరంలోనే 10:17–44 లోని సంఘటనలు నమోదైనవి) కంటే ముందు ఈ పుస్తకం పూర్తి చేయబడలేదు.

యెరూషలేము దాని పరిసర ప్రాంతాలలో ఎజ్రాలోని సంఘటనలు జరిగాయి. చెరలోనుండి తిరిగి వచ్చినవారు తమ పూర్వపు స్వదేశములో కొద్ది భాగాన్ని మాత్రమే జనావాసయోగ్యముగా చేసుకోగలిగారు.

ఎజ్రా ఎందుకంత ముఖ్యమైనది?

ఇశ్రాయేలు ప్రజల చారిత్రక గ్రంథములో ఎజ్రా పుస్తకం చాలా అవసరమైన బంధమును అందిస్తుంది. వారి రాజు సింహాసనం నుండి తొలగించబడి, బంధించబడి, జనులు బబులోనుకు చెరగొనిపోబడినప్పుడు, ఒక స్వతంత్ర దేశంగా యూదా ఉనికిలో లేదు. ఎజ్రా పుస్తకం యూదులు తిరిగి కలుసుకోవడం, తమ మనుగడ కోసం వారు చేసిన పోరాటం మరియు నాశనం చేయబడిన వాటిని పునర్నిర్మించడం గురించి వివరిస్తుంది. వారు ఇప్పటికీ దేవుని ప్రజలే అనియు మరియు దేవుడు వారిని మరచిపోలేదనియు తన కథనం ద్వారా ఎజ్రా ప్రకటించాడు.

ఎజ్రా పుస్తకంలో మనం క్రొత్త ఆలయం యొక్క పునర్నిర్మాణం, తిరిగి వచ్చిన గోత్రముల వారు ఒకే రకమైన శ్రమల్లో భాగము పంచుకొని, కష్టపడి కలిసి పనిచేయవలసి వచ్చినప్పుడు, వారు ఏకీకృతమవ్వటం కళ్లారా చూస్తాము. తరువాత, శేషింపబడినవారు పట్టణ ప్రాకార గోడలపై పనిచేయటం ఆపివేసి, ఆత్మీయ ఉదాసీనతలోనికి వెళ్లిపోయినప్పుడు, ఎజ్రా మరో రెండు వేల మందితో వచ్చి ఆత్మీయ పునరుజ్జీవనాన్ని వెలిగించాడు. పుస్తకం ముగిసే సమయానికి, ఇశ్రాయేలు దేవునితో తన నిబంధనను పునరుద్ధరించింది, అలాగే ఆయనకు విధేయత చూపడం ప్రారంభించింది.

పరిశుద్ధ గ్రంథము యొక్క గొప్ప విజ్ఞాపన ప్రార్థనలలో ఒకటి ఎజ్రాలో ఉంది (ఎజ్రా 9:5-15; మిగిలిన వాటికొరకు దానియేలు 9 మరియు నెహెమ్యా 9 చూడండి). అతని నాయకత్వం యూదుల ఆత్మీయ పురోగతికి కీలకమని నిరూపించింది.

ఎజ్రా యొక్క ఉద్దేశమేమిటి?

చెరలోనుండి తిరిగి వచ్చినవారు ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలను ఎజ్రా యొక్క కథనం వెల్లడిస్తుంది: (1) ఆలయాన్ని పునరుద్ధరించడానికి పోరాటం (ఎజ్రా 1:1–6:22) మరియు (2) ఆత్మీయ సంస్కరణ యొక్క అవసరత (7:1–10:44). ప్రజలు దేవునితో తమ సహవాసాన్ని పునరుద్ధరించుకోవడానికి ఈ రెండూ అవసరమే.

ఒక గొప్ప వేదాంత ఉద్దేశము బయలుపరచబడింది: దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు. డెభ్బై సంవత్సరాలు చెరలో ఉన్న తరువాత తన యొక్క ఏర్పరచబడిన జనాంగము తమ దేశానికి తిరిగి వెళతారని ప్రవక్తల ద్వారా దేవుడు నిర్ణయించాడు. దేవుడు తన మాటను నిలబెట్టుకున్నాడని ఎజ్రా యొక్క వృత్తాంతము ప్రకటించింది. అలాగే దేవుని ప్రజలు ఆయనకు విశ్వాసపాత్రులుగా ఉన్నప్పుడు, ఆయన వారిని ఆశీర్వదిస్తూనే ఉంటాడని ఎజ్రా యొక్క వృత్తాంతము తెలియజేస్తుంది. అందువల్ల, ఈ పుస్తకం దినవృత్తాంతములు (ఇది కూడా ఎజ్రా వ్రాయబడిన రోజుల్లోనే వ్రాయబడింది) మాదిరిగానే దేవాలయాన్ని మరియు క్రమమైన ఆరాధనను గూర్చి నొక్కి చెబుతుంది.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

యూదా ప్రజలు స్వదేశానికి తిరిగి రావడానికి అనుమతించి, ప్రోత్సహించి, సహాయం చేసే విధముగా లౌకిక పాలకుల (కోరెషు, దర్యావేషు మరియు అర్తహషస్త) హృదయాలను దేవుడు కదిలించాడు. ఆయన ఏర్పరచుకున్న ప్రజల పునరుద్ధరణ కోసం చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి అసంభావ్యమైన స్నేహితులను ఉపయోగించాడు. మీరు ఆశీర్వాదానికి అసంభావ్యమైన వనరులను ఎదుర్కొన్నారా? దేవుడు తన పేరు పెట్టి పిలువబడినవారికి మేలుకలుగుటకై సమస్తమును సమకూడి ఏలాగు జరుగుచున్నవోనని మీరు ఆశ్చర్యపడుచున్నారా (రోమా 8:28)? మీ జీవితంలో దేవుని సార్వభౌమత్వాన్ని, దయను ఒప్పుకోవడానికి ఈ రోజు సమయం కేటాయించండి. మీ విశ్వాసమును, మీ ప్రేమను, మీ విధేయతను ఆయన కొరకు తిరిగి సిద్ధము చేయండి.