యెహెజ్కేలు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

యెహెజ్కేలు పుస్తకానికి ఈ శీర్షిక యాజకుని పేరునుబట్టి పెట్టబడింది. ఈ యాజకుడు బూజీ యొక్క కుమారుడు. యెహెజ్కేలు యాజక వంశం తన ప్రవచనాత్మక పరిచర్యలో ప్రకాశిస్తుంది; అతను తరచుగా దేవాలయం, యాజకత్వం, ప్రభువు మహిమ మరియు అర్పణ పద్ధతి వంటి అంశాల విషయమై చింత కలిగియున్నాడు.

ప్రవచనం “ముప్పదియవ సంవత్సరంలో” ప్రారంభమైందని మనకు యెహెజ్కేలు 1:1 చెబుతుంది. పండితులు సాధారణంగా దీనిని యెహెజ్కేలు వయస్సుకు సూచనగా భావిస్తారు, దాదాపు ఒక దశాబ్దం క్రితమే బబులోను‌కు బహిష్కరించబడిన దానియేలునకు సమాన వయస్కునిగా ఇతనిని చేసారు. ఇశ్రాయేలుకు చెందిన చాలామంది యాజకుల మాదిరిగానే యెహెజ్కేలుకు వివాహం జరిగింది. తన ప్రవచనాత్మక పరిచర్యలో అతని భార్య మరణించినప్పుడు, దేవుని విషయాల పట్ల యూదా దేశము శ్రద్ధ చూపకపోవటానికి సంకేతంగా యెహెజ్కేలును బహిరంగముగా అంగలార్చవద్దని దేవుడు నివారించాడు (యెహెజ్కేలు 24:16-24).

మనమెక్కడ ఉన్నాము?

బబులోనుకు దక్షిణాన వంద మైళ్ళ కంటే తక్కువ దూరంలో ఉన్న తేలాబీబు (యెహెజ్కేలు 3:15) అని పిలువబడే కెబారు నది వెంబడినున్న ఒక స్థలమందు యెహెజ్కేలు బబులోనులోని చెరపట్టబడిన యూదుల మధ్య నివసించాడు. ఆక్రమణదారులైన బబులోనీయులు క్రీ.పూ. 597 లో పదివేలమంది యూదులను గ్రామానికి తీసుకువచ్చారు, ఇందులో యెహెజ్కేలు మరియు యూదా చివరి రాజైన యెహోయాకీను ఉన్నారు (2 రాజులు 24:8-14).

తేలాబీబులో చెరపట్టబడిన అయిదవ సంవత్సరమున యెహెజ్కేలు ప్రవచనం మొదలైనది (యెహెజ్కేలు 1:2). అతను కనీసం ఇరవై రెండు సంవత్సరాలు (29:17) ప్రజల మధ్య యెడతెగక ప్రవచించాడు. తనపై యెడతెగక తిరుగుబాటు చేసినందుకు దేవుడు చెరపట్టబడిన ప్రజలతో మాట్లాడినందున, యెహెజ్కేలు సందేశంలో ఎక్కువ భాగం చేసిన పాపాలకు తీర్పును గూర్చి తెలియజేస్తుంది (1:1–32:32). అయినప్పటికిని, ప్రవక్తలందరి మాదిరిగానే, ప్రస్తుతం తమకు స్వాస్థ్యముగా భూమి లేకున్నను, భవిష్యత్తు కొంత ఆశాజనకముగా ఉంటుందని అతడు తన ప్రజలకు తెలియజేసాడు (33:1–48:35).

యెహెజ్కేలు ఎందుకంత ముఖ్యమైనది?

యెహెజ్కేలు పుస్తకం ఇశ్రాయేలు మరియు చుట్టుప్రక్కల దేశాలపై తీర్పును ప్రకటించింది. అంతేకాక, ఇది పాత మరియు క్రొత్త నిబంధన గ్రంథాల దర్శనములను సంపూర్ణము చేస్తూ జోడిస్తూ, భవిష్యత్ వెయ్యేళ్ళ రాజ్యం యొక్క దర్శనమును కూడా అందిస్తుంది. ఈ పుస్తకం దేవుని ప్రజల పునరుత్థానం మరియు పునరుద్ధరణ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూపించడమే కాదు (యెహెజ్కేలు 37), ఇది యెరూషలేములోని పునర్నిర్మితమైన ఆలయం యొక్క చిత్రాన్ని పాఠకులకు అందిస్తుంది. దేవుని మహిమ ఆయన నివాస స్థలమునకు తిరిగి రావడంతో ఆలయమునకు పరిపూర్ణత సిద్ధిస్తుంది (40:1 –48:35). యెహెజ్కేలు ప్రవచనంలోని ఈ తరువాతి భాగం అంత్యదినములలో క్రీస్తు యొక్క రెండవ రాకడ తరువాత ప్రజల ఆరాధన కోసం ఎదురుచూస్తుంది. ఆయన ఇశ్రాయేలును మరియు జనములను యెరూషలేములో తన సింహాసనం నుండి వెయ్యి సంవత్సరాల పాలనలో పరిపాలించనున్నాడు.

యెహెజ్కేలు యొక్క ఉద్దేశమేమిటి?

దేవుడు ఇశ్రాయేలీయులను శిక్షించడానికి ప్రధానంగా చెరలోనికి పంపలేదు. దేవుడు అప్పుడు ఇప్పుడు ఎన్నడూ శిక్షించాలని శిక్షపై ఆసక్తి చూపలేదు. బదులుగా, తన ప్రజలను ఒకే నిజమైన దేవుని యెదుట పశ్చాత్తాపమునకు మరియు వినయమునకు తీసుకొనివచ్చే లక్ష్యమునకు కారణముగా ఆయన యెహెజ్కేలు దినములలో శిక్ష లేదా తీర్పును ఉద్దేశించాడు. వారు పాపము, తిరుగుబాటు, వారి సొంత శక్తి మరియు పొరుగు దేశాలపట్ల నమ్మకంతో చాలాకాలం జీవించారు. దేవుడు తన పరిశుద్ధ స్వభావాన్ని మరియు వారి దీనస్థితిని చాలా నాటకీయంగా గుర్తుచేయాల్సిన అవసరం ఉంది. శతాబ్దాల హెచ్చరికలు, ప్రవచనాత్మక సందేశాలు మరియు దండయాత్రల తరువాత, మరింత ముఖ్యమైన చర్య అవసరమని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ చర్య ఏమిటంటే, ఆయన ప్రజలను వారి వాగ్దాన దేశములో నుండి తొలగించవలసి వచ్చింది.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

యెహెజ్కేలు యొక్క మొత్తం ప్రవచనాత్మక పరిచర్య తేలాబీబు వద్ద ఉన్న చిన్న చెరపట్టబడిన సమాజం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ప్రజలు తమ ఇళ్ల నుండి మరియు జీవనోపాధి నుండి పెరికివేయబడి, ఒక పరదేశంలో తమ జీవితాలను గడుపుచున్నారు. ఈ ప్రజలను వెంటాడిన దిక్కుతోచని స్థితిని, గందరగోళ భావనలను మీరు ఊహించగలరా? దేవుని తీర్పుకు దారితీసిన పాపాత్మకమైన ప్రవర్తనలో ప్రత్యక్షంగా చాలా మంది చెరపట్టబడినవారు ఉన్నప్పటికీ, ఇవన్నీ వారికి ఎందుకు జరుగుతున్నవో అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు.

మనం కూడా కొన్నిసార్లు ఇదే దుస్థితిలో ఉండి “ఎందుకు ప్రభువా?” అని అడుగుతూ సమాధానం కోసం నిశ్శబ్దముగా ఎదురుచూస్తూ ఉంటాము. దేవుడు యెహెజ్కేలును పంపించటానికి చెరపట్టబడినవారు ఐదేళ్ళు వేచి ఉండాల్సి వచ్చింది. మరియు దేవుడు వారిని పంపించినప్పుడు, ప్రజలు వినడానికి ఇష్టపడని సందేశం ఆయన ప్రవక్త దగ్గర ఉంది: దేవుడు భూమ్యాకాశములకు ప్రభువు, మరియు ప్రజలు అనుభవిస్తున్న తీర్పు వారి పాపం యొక్క ఫలితం.

మనం త్రోవ తప్పిపోయినట్లు భావిస్తున్న ఆ చీకటి సమయాల్లో ప్రభువును వెతకాలని, మన జీవితాలను పరిశీలించుకోవాలని, మరియు ఒక నిజమైన దేవుణ్ణి మనం ఆధారం చేసుకోవాలని యెహెజ్కేలు పుస్తకం మనకు గుర్తు చేస్తుంది. ఈ రోజు అలా చేయుటకు మీరు ఆలోచిస్తారా?