నిర్గమకాండము

ఈ పుస్తకాన్ని వాుసినదెవరు?

ఆదికాండము మాదిరిగా, ప్రారంభ యూదా సాంప్రదాయాలు నిర్గమకాండమును రచించే ఉత్తమ అర్హత గల వ్యక్తిగా మోషే పేరునే పేర్కొన్నాయి. ఈ సిద్ధాంతానికి అనేక అంశాలు మద్దతు ఇస్తున్నాయి. ఐగుప్తు రాజ న్యాయస్థానాలలో మోషే యొక్క ప్రత్యేకమైన విద్య ఖచ్చితంగా ఈ రచనలను వ్రాసే అవకాశాన్ని మరియు సామర్థ్యాన్ని అతనికి అందించింది (అపొస్తలుల కార్యములు 7:22). అంతర్గత సాక్ష్యాలు (నిర్గమకాండము యొక్క వచనాల్లో లభించే విశేషాలు) మోషే రచనకు మద్దతునిచ్చాయి. అనేక సంభాషణలు, సంఘటనలు మరియు భౌగోళిక వివరాలు ప్రత్యక్ష సాక్షికి లేదా వీటిల్లో పాల్గొన్నవానికి మాత్రమే తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు, "మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి" (నిర్గమకాండము 24: 4) అని వాక్యం సెలవిచ్చుచున్నది. అదనంగా, “మోషే ధర్మశాస్త్రము” (యెహోషువ 1: 7; 1 రాజులు 2: 3) ను గూర్చి ఇతర బైబిల్ పుస్తకాలు కూడా ప్రస్తావించాయి గనుక నియమ నిబంధనలను కలిగివున్న నిర్గమకాండమును మోషేనే రాసినట్లు ఇవి సూచిస్తున్నాయి. నిర్గమకాండము 20:12; 21:17 నుండి “మోషే చెప్పెను గదా” (మార్కు 7:10) అనే పదాలతో యేసు స్వయంగా మోషే యొక్క మాటలను యథాతథంగా పరిచయం చేశాడు. ఇది పుస్తక రచయితపై ఆయనకున్న అవగాహనను ధృవీకరిస్తుంది.

“ఎక్సోడస్” అనే శీర్షిక సెప్టువాజింట్ నుండి వచ్చింది. తమ పితరుల దేవుడైన యెహోవా దక్షిణహస్త బలముచేత ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వమునుండి విడుదలనొంది మహానిర్గమనమవటమే ఈ పుస్తకంలో కనిపించే ప్రాథమిక సంఘటన. అందువల్లనే ఈ పుస్తకానికి "నిర్గమకాండము" అనే శీర్షిక వచ్చింది.

మనమెక్కడ ఉన్నాము?

గోషెను అనే ఐగుప్తు ప్రాంతంలో నిర్గమకాండము ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రజలు ఐగుప్తునుండి బయలుదేరి సీనాయి ద్వీపకల్పం యొక్క దక్షిణకొన వైపుకు వెళ్లినట్లు సాంప్రదాయక నమ్మకం. మోషే దేవుని ఆజ్ఞలను ఎక్కడైతే అందుకున్నాడో, ఆ సీనాయి పర్వతం యెదుట ఇశ్రాయేలీయులు బస చేసారు.

ఈ పుస్తకం మోషే పుట్టుక (సుమారు క్రీ.పూ. 1526) కంటే ముందే ఆరంభమై, క్రీ.పూ. 1446 లో సీనాయి పర్వతం వద్ద జరిగిన సంఘటనల వరకు, అనగా సుమారు ఎనభై సంవత్సరాల కాలాన్ని కలిగి ఉంది.

నిర్గమకాండము ఎందుకంత ముఖ్యమైనది?

నిర్గమకాండములో దేవుడు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం ప్రారంభించాడు. ఇశ్రాయేలీయులు పరదేశంలో బానిసలుగా ఉన్నప్పటికీ, దేవుడు అద్భుత రీతిలో నాటకీయ పరిణామాల మధ్య వారికి స్వేచ్ఛను అందజేసాడు. తరువాత దేవుడు సీనాయి పర్వతంపై మోషేతో చేసిన ఒడంబడిక ప్రకారం ఇశ్రాయేలును దైవపరిపాలనా దేశంగా స్థాపించాడు. పది తెగుళ్ళు, పస్కా పండుగ, ఎఱ్ఱ సముద్రము చీలడం, సీనాయి పర్వతం వద్ద దేవుని సన్నిధి యొక్క భయంకరమైన ఘనత, పది ఆజ్ఞలను ఇవ్వడం, గుడారం నిర్మించడం. . . నిర్గమకాండము నుండి వచ్చిన ఈ సంఘటనలన్నీ యూదుల విశ్వాసానికి పునాది. భవిష్యత్తులో లేఖనాలను చదివే పాఠకులకు మొత్తం బైబిల్ యొక్క విమోచన సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సంఘటనలన్నీ కీలకమైన నేపథ్య సందర్భాన్ని అందిస్తాయి. నిర్గమకాండము గురించి వివిధ బైబిల్ రచయితలు తరచు ఉదాహరించుట, అలాగే యేసు తన సొంత మాటల్లో ఉదాహరించుట కూడా ఈ పుస్తకము యొక్క ప్రాముఖ్యతకు నిదర్శనం.

నిర్గమకాండము యొక్క ఉద్దేశమేమిటి?

విముక్తి అనగా దేవుడు ఇశ్రాయేలీయులను ఎలా విడిపించి వారిని తన ప్రత్యేక జనాంగముగా చేసుకున్నాడనేదే నిర్గమకాండము యొక్క ఇతివృత్తం. దేవుడు వారిని బానిసత్వం నుండి రక్షించిన తరువాత ధర్మశాస్త్రాన్ని అందించాడు. ఈ ధర్మశాస్త్రము ప్రజలను ఎలా పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి అనే సూచనలను చేసింది. ఆయన బల్యర్పణ పద్ధతిని స్థాపించాడు. ఈ పద్ధతనేది, వారు సరియైన ఆరాధన క్రమంలో ఉండుటకు మార్గనిర్దేశం చేసింది. అంతే ముఖ్యమైనదిగా, దేవుడు తన గుడారము లేదా గుడారము నిర్మించటానికి వివరణాత్మక ఆదేశాలను అందించాడు. వారు ఆయన ప్రజలనుటకు యింకొక ఋజువు ఏమిటంటే- దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య నివసించాలని, తన తేజోమహిమను వారి మధ్య బయలుపరచాలని కోరుకున్నాడు (నిర్గమకాండము 40:34-35).

ప్రారంభంలో డికాలాగ్ (పది ఆజ్ఞలు) ద్వారా ఆవిష్కరించబడిన ఈ మోషే ఒడంబడిక, సాధారణ ఆహార పద్ధతుల నుండి సంక్లిష్టమైన ఆరాధన నిబంధనల వరకు ఉన్నటువంటి యూదా మతం యొక్క నమ్మకాలకు మరియు ఆచారాలకు పునాది వేసింది. సమస్త జీవితము దేవునికి సంబంధించినదని దేవుడు ధర్మశాస్త్రం ద్వారా చెప్పాడు. ఆయన అధికారమునకు లోబడనిది ఏదీ లేదు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

ఐగుప్తును విడిచిపెట్టిన ఇశ్రాయేలీయుల మాదిరిగానే, క్రీస్తునందు విశ్వాసులందరూ విమోచించబడి దేవునికి ప్రతిష్ఠింపబడ్డారు. మోషే ఒడంబడిక ప్రకారం, ప్రజలు తమ పాపాలను ఆ జంతువు ద్వారా కప్పబడటానికి లేదా భరించడానికి, ప్రత్యేకమైన నిబంధనల ప్రకారం ఏటేట నిర్దోషమైన జంతువులను బలిగా అర్పించేవారు. " అయితే ఆ బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము" (హెబ్రీయులు 10: 3–4) అని క్రొత్త నిబంధనలోని హెబ్రీయులకు వ్రాసిన పత్రిక యొక్క రచయిత చెప్పాడు. సిలువపై యేసు చేసిన త్యాగం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది. దేవుని పరిపూర్ణమైన నిర్దోషమైన గొఱ్ఱెపిల్లగా, మన తరపున తనను తాను అర్పించుకొని ఆయన మన పాపాన్ని శాశ్వతంగా తీసివేసాడు. “యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము" (హెబ్రీయులు 10:10).

ఆయన మీ పక్షమున తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన అర్పణను మీరు అంగీకరించారా? మీరు నిజముగా "విమోచింపబడ్డారా"? మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే, “దేవునితో సంబంధాన్ని ఎలా ఆరంభించాలి” చూడండి.