ఎఫెసీయులకు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

తన రెండవ మిషనరీ ప్రయాణం చివరలో కొంతకాలం, ఆపై తన మూడవ మిషనరీ ప్రయాణంలో రెండు సంవత్సరాలకు పైగా, పౌలు ఎఫెసీ సంఘమునకు పరిచర్య చేసాడు (అపొస్తలుల కార్యములు 18:18–21; 19:1–41). గ్రీకు దేవతయైన అర్తెమిదేవికి ప్రసిద్ధ దేవాలయం ఉన్న ఈ నగరంలో, మారుమనస్సుపొంది యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన అనేకులను, యింకా సమాజమందిరాల్లోను ఇళ్ళలోను తన బోధను వ్యతిరేకించిన అనేకులను పౌలు చూశాడు. అర్తెమిదేవి ఆరాధన కోసం పనిముట్లు చేసే ఒక ప్రముఖ కంసాలి, దేమేత్రి, ప్రజలు క్రైస్తవ్యంలోకి మారుతున్నందున తన వ్యాపారం బాగా దెబ్బతినటం గమనించాడు. తరువాత జరిగిన అల్లర్లు పౌలును నగరాన్ని విడిచి వెళ్ళేటట్లు చేశాయి. కాని అక్కడ ఉన్న క్రైస్తవ సమాజాన్ని స్థిరపరచి వృద్ధిపరచిన తరువాత మాత్రమే అపొస్తలుడు ఆ పట్టణాన్ని విడిచి వెళ్లాడు.

మనమెక్కడ ఉన్నాము?

క్రీ.శ. 60-61లో పౌలు ఎఫెసీయులకు ఈ లేఖ రాశాడు, అదే సమయంలో అతను కొలొస్సయులకు మరియు ఫిలేమోనుకు వ్రాసాడు, అతను ఈ మూడు పత్రికలను తుకికు చేతితో పంపాడు, ఒనేసిము‌ను కూడా అతనివెంట పంపాడు (ఎఫెసీయులకు 6:21; కొలొస్సయులకు 4:7–9; ఫిలేమోనుకు 1:10–12). ఈ సమయంలోనే పౌలు తన మొదటి రోమా జైలు శిక్షకు గురై రోమా‌లో ఉన్నాడు (ఎఫెసీయులకు 3:1; 4:1). జైలు పత్రికలు అని పిలువబడే నాలుగు పత్రికల్లో ఒకటిగా ఎఫెసీయులను రచించాడు. మిగిలిన మూడు ఏవంటే, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు మరియు ఫిలేమోనుకు.

ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక ఎందుకంత ముఖ్యమైనది?

రెండవ కొరింథీయులకు మరియు గలతీయులకు పత్రికలు పౌలు యొక్క వ్యక్తిగత జీవితం గురించి లేదా గ్రహీతల వ్యక్తిగత జీవితం గురించిన విషయాలతో నిండియున్నవి. అయితే, ఎఫెసీ పత్రిక ఇందుకు పూర్తి భిన్నంగా పౌలు యొక్క అత్యంత అధికారిక పత్రికలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ధర్మశాస్త్ర సంబంధమైన పితృపారంపర్యాచారములను పాటిస్తూ కొట్టుకుపోయే సంఘాలకు గలతీ పత్రిక ముఖ్యమైన సూచనలను అందిస్తుండగా, సమాజంలో ఎటువంటి ప్రత్యేకమైన సమస్యతో సంబంధం లేకుండా విశ్వాసము మరియు ఆచరణలో క్రైస్తవుడిగా ఉండటమంటే అర్ధం ఏమిటో అనే దాని యొక్క ముఖ్య భాగం గూర్చి ఎఫెసీ పత్రిక వ్యవహరిస్తుంది.

ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక యొక్క ఉద్దేశమేమిటి?

పౌలు తన ఎఫెసీ పత్రికను రెండు స్పష్టమైన భాగాలుగా విభజించాడు; మొదటి భాగంలోని సత్యాలను వర్తింపజేయడం వలన రెండవ భగంలోని క్రియలు మరియు జీవనశైలి సాధ్యం అవుతాయి. యేసుక్రీస్తు మరణం మరియు పునరుత్థానంలో తన ఉచితమైన కృపచేత పరిశుద్ధ సమాజాన్ని దేవుడు ఏర్పరచడం గురించి పత్రిక యొక్క మొదటి మూడు అధ్యాయాలను వెచ్చించాడు. ఈ సమాజంలోని సభ్యులు క్రీస్తు కార్యము ద్వారా దేవునిచేత ఎన్నుకోబడి, దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా దత్తత తీసుకోబడి, తన కుమారునియందలి విశ్వాసం ద్వారా తండ్రి దగ్గరకు తీసుకురాబడ్డారు. ఈ విశ్వాసం ఉన్న ప్రజలందరూ-యూదులు మరియు అన్యజనులు-వారి అతిక్రమములలో మరియు పాపాలలో చనిపోయారు, కాని యేసుక్రీస్తు అనే వ్యక్తి కారణంగాను మరియు ఆయన యొక్క క్రియ కారణంగాను సజీవంగా ఉన్నారు.

పౌలు ఒక నిర్దిష్ట వేదాంత లేదా నైతిక సమస్యకు స్పందించలేదుగాని, ఎఫెసీయులను వారి విశ్వాసంలో పరిపక్వం చెందమని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ సమస్యల నుండి వారిని రక్షించాలని అతను కోరుకున్నాడు. కాబట్టి పుస్తకం యొక్క మొదటి భాగంలో లోతైన వేదాంత సత్యాలను చెప్పిన తరువాత, పౌలు తన ఉద్దేశ్యాన్ని స్పష్టం చేశాడు: ఈ విశ్వాస సమాజం దాని పరలోకపు పిలుపునకు అనుగుణంగా నడుస్తుందని అతను ఆశించాడు (ఎఫెసీయులు 4:1). క్రైస్తవులు దేవునిమీదున్న విశ్వాసం ద్వారా అంగీకరించే వేదాంత వాస్తవాల ఫలితంగా, సంఘము లోపల, ఇంటిలో మరియు లోకంలో వారి సంబంధాలలో అనేక అభ్యాసములను అనుసరించాలి.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

ఎఫెసీయుల పుస్తకం విస్తృతమైన నీతి మరియు నైతిక ప్రవర్తనలను లక్ష్యంగా చేసుకుంది, మన పరలోకపు పిలుపుకు అనుగుణంగా విశ్వాసులమైన మనం జీవిస్తున్నామా లేదా అని నిశ్చయించుకోవడానికి రూపొందించబడింది. మనము రోజు రోజుకు, నెల నెలకు, సంవత్సరం సంవత్సరానికి మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు, సుఖాన్ని పొందుకోవాలన్న శోధన ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే, పౌలు క్రీస్తులో దేవుని బహుమతిని మరియు మనకు లభించే ప్రయోజనాలను చాలా స్పష్టంగా సమర్పించాడు, కాని మన జీవితాలు ఆ వాస్తవికతను ప్రతిబింబిస్తున్నాయా అని మనల్ని మనం ప్రశ్నించుకోవటం తప్ప మనమేమీ చేయలేము.

మీరు యేసుక్రీస్తునందు విశ్వాసములోనికి వచ్చినప్పటి నుండి మీ క్రైస్తవ జీవితంలో ఎలా ఎదుగుచున్నారు? ఇనుముచేత ఇనుము పదునగునట్లు (సామెతలు 27:17) ఆత్మీయ ఎదుగుదల ప్రధానంగా ఇతరులతో సహవాసంలో ఉంటేనే సంభవిస్తుందని ఎఫెసీ పత్రిక చివరి సగం స్పష్టం చేస్తుంది. ఆత్మీయ యుద్ధంలో మీ క్రైస్తవ “నడక” (మరో మాటలో చెప్పాలంటే, మీ దైనందిన జీవితం) ఐక్యత, పరిశుద్ధత, ప్రేమ, జ్ఞానం మరియు ఓర్పు ద్వారా వర్ణించబడాలి.

పరిపక్వత విశ్వాసుల నైతిక జీవితాలలో ప్రయోజనాలను ఇస్తుంది, కానీ అది దాన్ని మించి విస్తరిస్తుంది. పరిపక్వత వృద్ధిచెందటం వలన సమాజం మొత్తానికి ప్రయోజనం చేకూరుతుంది. అలాగే క్రైస్తవులుగా మన జీవితాల్లో దేవుని పనికి మరింత స్థిరమైన సాక్ష్యమిచ్చునట్లుగా నడిపిస్తుంది. అలాగే చరిత్రలో చాలా సమాజాలను పీడించిన హానికరమైన విభజనలు మరియు తగాదాల నుండి మనలను కాపాడుతుంది.