ప్రసంగి

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

“ప్రసంగి” అనే శీర్షిక ఒక గ్రీకు పదం నుండి వచ్చింది. ఇది ఒక సభను ఉద్దేశించి మాట్లాడే వ్యక్తిని సూచిస్తుంది. కాబట్టి రచయిత హెబ్రీ పదమైన "ఖోహెలెత్" ద్వారా తనను తాను ప్రసంగి 1:1 లో గుర్తించుకున్నాడు. "ఖోహెలెత్" అనగా “ప్రసంగి లేక బోధకుడు” అని అనువదించబడింది. తన గుర్తింపును సూచించడానికి ఈ నిగూఢమైన పేరు మాత్రమే ఉన్నప్పటికీ, చాలా యూదు మరియు క్రైస్తవ సంప్రదాయాలతో పాటు, పుస్తకంలోని సాక్ష్యాలు, సొలొమోను రాజు ప్రసంగిని రచించాడని సూచిస్తున్నాయి.

ప్రసంగి తనను తాను “దావీదు కుమారుడును యెరూషలేములో రాజు” అని పిలుచుకున్నాడు, “ యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటెను నేను చాల ఎక్కువగా జ్ఞానము సంపాదించితి ననియు” చెప్పాడు, మరియు అనేక సామెతలను అనుక్రమపరచాడు (ప్రసంగి 1:1, 16; 12:9). సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులమీద రాజుగా దావీదు తర్వాత సింహాసనాధీష్టుడై అక్కడనుండే ఇశ్రాయేలీయులందరినీ పరిపాలించిన ఏకైక దావీదు కుమారుడిగా ఉన్నాడు (1:12). అతను తన కాలంలో ప్రపంచంలోనే అధికమైన జ్ఞానముగల వ్యక్తి (1 రాజులు 4:29-30) మరియు సామెతల పుస్తకంలో ఎక్కువ భాగం రాశాడు (సామెతలు 1:1; 10:1; 25:1). కాబట్టి, ప్రారంభ వచనం యొక్క ఖోహెలెత్‌ ("ప్రసంగి")గా మనం సొలొమోనును సురక్షితముగా గుర్తించగలము.

మనమెక్కడ ఉన్నాము?

సొలొమోను ఈ పుస్తక రచయిత గనుక, క్రీ.పూ. 931 లో ఆయన మరణానికి కొంతకాలం ముందు వ్రాయబడి ఉంటుందని మనకు తెలుసు. ప్రసంగి యొక్క విషయమేమంటే, ఎవరో ఒకరు తమ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోగా ఎంతో అనుభవమున్నప్పటికిని, శాశ్వతమైన బహుమానాలు మాత్రం కొరత కలిగియున్నట్లు ప్రతిబింబింపఁజేస్తుంది. ఒక రాజుగా, జ్ఞానము, సుఖము, మరియు పని మొదలగు ప్రతిఫలాలను వెంటాడటానికి అతనికి అవకాశం మరియు వనరులు ఉన్నాయి. అయినప్పటికీ, ప్రపంచం వలన అలసిపోయిన స్వరముతో, జీవిత చరమాంకములో, అతను తన మూర్ఖత్వాన్ని విచారంతో వెనక్కి తిరిగి చూసుకున్నాడు. దేవుని మార్గము యొక్క వెలుగులో జీవించదగిన మెరుగైన, సరళమైన జీవితాన్ని మనకు చూపించాడు (ప్రసంగి 12:13-14).

ప్రసంగి ఎందుకంత ముఖ్యమైనది?

ప్రసంగి మనకు జీవితం యొక్క సహజమైన దృష్టిని ప్రత్యక్షపరచింది. ఒక వ్యక్తి తన విశేషమైన మానవ కళ్ళ ద్వారా జీవితాన్ని చూడటాన్ని ఈ పుస్తకములో చూడవచ్చు-అయితే చివరికి ప్రపంచంలో దేవుని అధికారము మరియు పరిపాలనను ఈ పుస్తకం గుర్తిస్తుంది. మానవీయ తత్వం ఎక్కువగావున్న ఈ పుస్తకాన్ని ఈ రోజు యువ ప్రేక్షకులలో, అనగా న్యాయమైన తమ వంతుకంటే ఎక్కువ బాధను అస్థిరతను తమ జీవితాల్లో చూచి ఇప్పటికీ దేవుని మీదనే ఆశ పెట్టుకుని ఉన్న స్త్రీపురుషుల్లో బాగా ప్రాచుర్యం పొందింది.

ప్రసంగి యొక్క ఉద్దేశమేమిటి?

ప్రసంగి కూడా, చాలామట్టుకు జీవితంలాగానే, ఒక కొన నుండి మరో కొన వరకు సాగే ప్రయాణాన్ని సూచిస్తుంది. సొలొమోను తన ఆరంభ బిందువును పుస్తక ప్రారంభంలో ఇలా వ్యక్తీకరించాడు: “వ్యర్థము వ్యర్థము! సమస్తము వ్యర్థమే”(ప్రసంగి 1:2). తాను చూసిన ప్రకారముగా జీవితము పూర్తిగా వ్యర్థమని అర్థరహితమని ఈ వాక్యం సూచిస్తుంది. సుఖము, పని మరియు తెలివి వంటి ఎన్ని నివారణ మార్గములు ప్రయత్నించినప్పటికీ, లోకంలో తాను తప్పిపోయాననే భావనను మాత్రం ఏదీ కూడా తగ్గించలేకపోయింది.

ఏదేమైనా, జీవితంలో అర్థం మరియు ప్రాముఖ్యత కోసం రచయిత యొక్క తీరని శోధనలో కూడా దేవుడు ఉన్నాడు. ఉదాహరణకు, దేవుడు అన్న పానములను, పనిని దయచేసాడని (2:24); పాపి మరియు నీతిమంతుడు ఇద్దరూ దేవుని దృష్టిలో ఉన్నారని (2:26); దేవుని పనులు శాశ్వతమైనవని (3:14); మరియు దేవుడు తాను సమకూర్చువాటిని ఆస్వాదించడానికి ప్రజలకు వీలుకలుగజేస్తాడని (5:19) మనం చదువుతాము. అంతిమంగా, ప్రసంగి యొక్క పరమార్థం మన జీవితాలపై దేవుని నిత్య కాపుదలను గుర్తించడంలో ఉంది. అన్యాయం మరియు అనిశ్చితి మనలను అణచివేస్తూ భయపెడుతున్నప్పటికీ, మనం ఆయనను విశ్వసించి ఆయనను వెంబడించవచ్చు (12:13-14).

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

మనమందరం జీవితంలో అర్థాన్ని కోరుకుంటాము. ఒక్కొక్కసారి ఆ అర్థాన్ని వెదికే క్రమంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అప్పుడప్పుడు సంతృప్తిని ఆస్వాదించి కొంతకాలం ప్రకాశవంతంగా ప్రకాశించి చివరికి క్రమంగా అంతరించిపోతుంది. ఒక విధంగా చూస్తే, ఆ అనుభవం ప్రసంగి అంతటా ప్రతిధ్వనించడం ఆదరణ కలిగించేదిగా ఉంది. ఈ పుస్తకమును చదువుట వలన మానవత్వం పట్ల ప్రశంసలు ఉద్భవిస్తాయి. మనము సొలొమోను యొక్క ప్రయాణంతో మన ప్రయాణమును జోడించుకుంటాము, ఎందుకంటే మనలో చాలా మందికి ఇది మన సొంత ప్రయాణమువలె కనబడుతుంది. ఆనందం, ఉద్యోగానికి నిబద్ధత లేదా మేధో మధనము ద్వారా మనం అర్థాన్ని కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు, చివరికి మనమందరం ఈ ప్రయత్నాలలో ప్రతిష్టంభననే ఎదుర్కొంటాము.

ఈ ప్రక్రియ ద్వారా జీవించి, జ్ఞానము కలిగి, కాలానుగుణమైన దృక్పథంతో ఉద్భవించిన వ్యక్తిని ప్రసంగి మనకు చూపిస్తుంది. జీవితం యొక్క అంతిమ శూన్యతను ప్రకటించే శోధనతో మనం చుట్టుముట్టబడినప్పుడు, మనము ప్రసంగిలో దైవిక దృష్టిమీద మొగ్గు చూపుట ద్వారా అనుభవంతో నిండిన దృష్టిని చూడవచ్చు. దేవుని ప్రమేయం లేకపోతే మన జీవితం యొక్క గమ్యస్థానం అసంతృప్తిగానే ఉంటుందని మనం గుర్తించాలి. నిశ్చయమైన శక్తిగల ఆయన హస్తముల మీద మనం నమ్మకమును ఉంచుతామా లేదా అనేది మాత్రమే చూడాలి.

మీరు జీవితంలో తప్పుగా ప్రయత్నాలు చేసి కష్టపడ్డారా? మీ జీవితానికి మీరు కోరుకునే అర్థం మరియు ఉద్దేశ్యం లోపించిందా? మీ విశ్వాసాన్ని దేవుని మీద మాత్రమే ఉంచునట్లు మిమ్మల్ని ప్రోత్సాహపరచటానికి సొలొమోను చెప్పిన మాటలను వినండి.