ద్వితీయోపదేశకాండము

Who wrote the book?

ద్వితీయోపదేశకాండము అంటే “రెండవసారి ఉపదేశించటం, రెండవ ధర్మశాస్త్రము.” ద్వితీయోపదేశకాండము 17:18 లోని మిష్నా (మిష్నా అనగా “మరల ధ్యానించుట,” “ఒక ప్రతి,” లేక “రెండవది”) అనే హెబ్రీ పదం నుండి ఉద్భవించింది. ఈ వాక్యభాగంలో రాజును “ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని”1 వ్రాసికొనవలెనని మోషే ఆదేశించాడు. అయితే ద్వితీయోపదేశకాండము ధర్మశాస్త్రం యొక్క ప్రతిని ఇవ్వడం కంటే చాలా ఎక్కువే చేసింది. ఈ పుస్తకం గడచిన సంగతుల యొక్క ప్రతిని మాత్రమే గాక, క్రొత్తతరం కొరకు ధర్మశాస్త్రమును రెండవసారి ఉపదేశించింది. ద్వితీయోపదేశకాండము ఈ “రెండవ ధర్మశాస్త్రము” ను, అనగా మోషే ఉపదేశముల క్రమమును పొందుపరచింది. దీనిలో ఇశ్రాయేలీయులకు నలభై సంవత్సరాల క్రితం నిర్గమకాండము మరియు లేవీయకాండములలో ఇవ్వబడిన దేవుని ఆజ్ఞలను మోషే మరల రెండవసారి ఉపదేశించాడు.

“మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే” అని ద్వితీయోపదేశకాండము 1:1 చెబుతోంది. ఈ పుస్తకం యొక్క రచయిత మోషే అని యూదా సాంప్రదాయం నుండి (పంచకాండమంతయు), పరిశుద్ధ గ్రంథములోని పలు వాక్యభాగాల నుండి సహజముగా బలపరచడాన్ని చూడగలము. అనేకసార్లు ద్వితీయోపదేశకాండమే మోషేను రచయితగా నొక్కి చెప్పింది (1:1; 4:44; 29:1). మోషే వారసుడైన యెహోషువతో మాట్లాడుతూ, ఈ “ధర్మశాస్త్ర గ్రంథాన్ని” మోషే ఆజ్ఞాపించినట్లుగా దేవుడైన యెహోవా సూచించాడు (యెహోషువ 1:8). భవిష్యత్ పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన రచయితలు ద్వితీయోపదేశకాండము నుండి ఉటంకించినప్పుడు, ఈ పుస్తకం మోషేతోనే ఉద్భవించినట్లు వారు సూచించారు (1 రాజులు 2:3; 2 రాజులు 14:6; ఎజ్రా 3:2; నెహెమ్యా 1:7; మలాకీ 4:4; మత్తయి 19:7).

మోషే దీనిలో ఎక్కువ భాగాన్ని భద్రపరచిన తర్వాత కొంత స్పష్టమైన సంపాదకీయ మార్పులు వాక్యభాగంలో చేయబడ్డాయి. ఉదాహరణకు, మోషే తన మరణానికి సంబంధించిన చివరి అధ్యాయాన్ని వ్రాసి ఉండకపోవచ్చు. ఏదేమైనా, ఇవి మరియు ఇతర చిన్న మార్పులు సాధారణంగా ఆమోదించబడిన మోషే యొక్క గ్రంథకర్తృత్వాన్ని లేక రచయిత హక్కును ప్రభావితం చేయవు.

మనమెక్కడ ఉన్నాము?

క్రీ.పూ. 1406 లో ఇశ్రాయేలు దేశం సహించిన నలభై సంవత్సరాల అరణ్య సంచారము ముగింపునకు వచ్చే సమయానికి ద్వితీయోపదేశకాండము వ్రాయబడింది. ఆ సమయంలో, ప్రజలు యొర్దాను నదికి తూర్పు వైపున, మోయాబు మైదానంలో, యెరికో నగరమునకు ఎదురుగా దిగారు (ద్వితీయోపదేశకాండము 1:1; 29:1). వారు తమ పూర్వీకులకు శతాబ్దాల ముందు వాగ్దానం చేయబడిన దేశములోకి ప్రవేశించటానికి సమీపించుచున్నారు (ఆదికాండము 12:1, 6–9). ఐగుప్తును విడిచిపెట్టిన పిల్లలు ఇప్పుడు పెద్దవారై, వాగ్దాన దేశాన్ని ఆక్రమించుకొని స్థిరపడటానికి సిద్ధంగా ఉన్నారు. అది జరగడానికి ముందు, యెహోవా దేవుడు మోషే ద్వారా వారితో తన నిబంధనను పునరుద్ఘాటించెను.

ద్వితీయోపదేశకాండము ఎందుకంత ముఖ్యమైనది?

మోషే తన మాటలను “ఇశ్రాయేలీయులందరికీ” కనీసం పన్నెండు సార్లు ప్రసంగించాడు. “ఇశ్రాయేలీయులందరికీ” అనే ఈ మాట దేశం యొక్క ఐక్యతను నొక్కి చెప్పింది. అలాగే ఈ మాట సీనాయి పర్వతం వద్ద దేవునితో వారు చేసిన నిబంధన ద్వారా ప్రారంభించబడి అరణ్యంలో రూపుదిద్దుకున్నది. బహుదేవతారాధన మధ్య ఇశ్రాయేలు దేశం యెహోవా దేవుణ్ణి మాత్రమే ఆరాధించుట ద్వారా ప్రత్యేకముగా నిలిచింది. వీరి దేవుడు పూర్తిగా ప్రత్యేకమైనవాడు; చుట్టుప్రక్కల ఉన్న దేశాల “దేవతలలో” ఆయనవంటివారెవరునూ లేరు. ద్వితీయోపదేశకాండము 6:4 ఈ నమ్మకాన్ని "షెమా"లో క్రోడీకరించింది. ఈనాటికీ ఇది యూదా మత విశ్వాసం యొక్క ప్రాథమిక సాక్ష్యం. "ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా."

ద్వితీయోపదేశకాండము పది ఆజ్ఞలను, అలాగే నిర్గమకాండము మరియు లేవీయకాండములలో ఇవ్వబడిన అనేకమైన ఇతర ఆజ్ఞలను పునరుద్ఘాటించింది. వాగ్దాన దేశంలో ఆశీర్వాద జీవితాన్ని ఎలా గడపాలనే దానిపై దేవుని సూచనలను ఈ పుస్తకం ఇశ్రాయేలునకు అందించింది. విధేయత వలన కలిగే ఆశీర్వాదాలను మరియు అవిధేయత వలన కలిగే శాపాలను 27 మరియు 28 అధ్యాయాలు విశదీకరించాయి.

ద్వితీయోపదేశకాండము యొక్క ఉద్దేశమేమిటి?

దేవుడు అబ్రాహాముతో చేసిన షరతుల్లేని నిబంధన వలె కాకుండా, యెహోవా మరియు ఇశ్రాయేలు మధ్యనున్న నిబంధన ద్వైపాక్షికం, అంటే ఇద్దరి మధ్య అవగాహనతో కూడిన నిబంధన అనమాట. ప్రజలు విశ్వాసపాత్రులుగా ఉంటేనే దేవుడు దేశాన్ని ఆశీర్వదించి తన వాగ్దానమును నిలుపుకుంటాడు. ఈ పుస్తకంలో వయస్సులో ఎదిగి పెద్దవారైన ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం వద్ద జరిగిన మొదటి నిబంధన కార్యములో పాల్గొనే సమయానికి వయస్సులో చాలా చిన్నవారు. అందువల్ల, మోషే వాగ్దాన దేశపు ప్రవేశ ద్వారమునొద్ద ధర్మశాస్త్రాన్ని సింహావలోకనం చేశాడు. యెహోవాతో తిరిగి నిబంధన చేసికొనుమని, ఆయన మార్గాల్లో తమ్మును తాము తిరిగి సమర్పించుకోవాలని ఈ క్రొత్త తరాన్ని విజ్ఞప్తి చేశాడు.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

మోషే ముగింపులో ప్రజలను ఈ విధముగా వేడుకున్నాడు,

“"నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొను నట్లును జీవమును కోరుకొనుడి." (ద్వితీయోపదేశకాండము 30:19-20)

20 వ వచనంలో మీ దేవుడైన యెహోవాను ప్రేమించడం, ఆయన వాక్యము వినడం మరియు ఆయనను హత్తుకోవడం మనం చూడగలము. అదే జీవము! దేవునితో మన సంబంధము నమ్మకత, విధేయత, ప్రేమ మరియు భక్తితో ముద్రవేయబడాలి. ఒక ఆదర్శ వివాహం గురించి ఆలోచించండి. మనం ఆయనను ఈ విధముగా హత్తుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు (ఎఫెసీయులు 5: 28-32).

మీరు దేవునికి ఎంత దగ్గరగా ఉంటూ ఆయనను హత్తుకొని జీవిస్తున్నారు? ఆయనతో ఉన్న అతి ముఖ్యమైన సంబంధము కొరకై ప్రార్థించండి, మీ హృదయాన్ని తిరిగి ఆయనకే సమర్పించుకోండి.

  1. Merrill F. Unger, Unger's Commentary on the Old Testament (Chattanooga, Tenn.: AMG, 2002), 233.