దానియేలు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

దీని రచయిత పేరే దీనికి శీర్షికగా పెట్టబడింది. ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిన యూదుడు బబులోనులో గడిపిన సమయం యొక్క ఫలితమే ఈ దానియేలు పుస్తకం. బాలునిగా ఉన్నప్పుడే దానియేలు ఇశ్రాయేలీయులలో ముఖ్యులైన బాలురతో బబులోనుకు ప్రయాణమైయ్యాడు. ఈ ముఖ్యులైన, ఆశపెట్టుకోదగిన మనుష్యులు సేవలో ఉపయోగపడతారని జయించినవారు భావించారు (దానియేలు 1:3-4). ఒకసారి దానియేలు అక్కడకు చేరాక, బబులోను నాయకత్వం అతని నూతన నివాసముతో (1:7) మరింత దగ్గరగా సంబంధము కలిగియుండులాగున అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టారు. యూదుల డెభ్బై సంవత్సరాల చెరలో దానియేలు అక్కడే నివసించాడు (1:21; 9:2). చివరికి రాజ్యం అంతటా ప్రాంతీయ అధిపతులపై ముగ్గురు ప్రధానులలో ఒకనిగా దానియేలు ఎదిగాడు (6:1).

బబులోనీయుల రాజధానిలో ఉన్న సమయంలో చెరపట్టబడిన యూదుల కోసం దానియేలు తన అనుభవాలను మరియు ప్రవచనాలను పొందుపరచాడు. అక్కడ రాజుకు ఆయన చేసిన సేవ సమాజంలోని అత్యున్నత స్థానములకు ప్రత్యేక ప్రవేశం కల్పించింది. తన సొంతం కాని భూమిలోను మరియు సంస్కృతిలోను ప్రభువుకు ఆయన నమ్మకముగా చేసిన సేవ, ఆయనను దాదాపు లేఖనాల్లోని ప్రజలందరిలో ప్రత్యేకతను సంతరించుకున్నవానిగా చూపించింది. అతని చర్యల గురించి పూర్తిగా సానుకూల సమాచారమును పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడిన ముఖ్య వ్యక్తుల్లో ఏకైక వ్యక్తిగా దానియేలు నిలుస్తాడు.

మనమెక్కడ ఉన్నాము?

క్రీ.పూ. 605 లో బబులోనీయులు తమ సామ్రాజ్యం యొక్క సాంస్కృతిక కేంద్రమైన బబులోను నగరానికి దానియేలును మరియు బబులోనీయుల పేర్లు కలిగియున్న అతని ముగ్గురు స్నేహితులైన షద్రకు, మేషాకు మరియు అబేద్నెగో మొదలగువారు ఉన్న గుంపును చెరగొనిపోయారు. ఈ చర్య యెరూషలేమును, విశ్వాసఘాతకుడైన యెహోయాకీము రాజును (2 రాజులు 23:36-24:2) లోబరచుకున్న తరువాత ఇశ్రాయేలు‌లో బబులోనీయులు చేపట్టిన మూడు దేశ బహిష్కరణలలో (క్రీ.పూ. 605, 597, మరియు 586) ఇది మొదటిది. యుక్తవయస్సులో ఉన్న దానియేలు ఒక బలమైన బహుదేవత మత సంస్కృతి మధ్యలో తాను చిక్కుకున్నాడు, అంటే అతను పాపములో పడిపోవటానికి తగినన్ని అవకాశాలు ఉన్నాయి. అయితే, అతను ఆహార నిబంధనలు మరియు ఆరాధన పద్ధతులతో సహా అనేక ముఖ్యమైన విషయాలపై బబులోను ప్రజల మధ్య తన విశ్వాసంలో దృఢముగా నిలబడ్డాడు (దానియేలు 1:8-16; 6:6-12).

దానియేలు ఎందుకంత ముఖ్యమైనది?

పరదేశంలో తీర్పును అనుభవిస్తున్న కాలమునకు సంబంధించిన కొన్ని బైబిల్ పుస్తకాల్లో దానియేలు ఒకటి (చాలా పుస్తకాలు ఈ తీర్పును గూర్చి ముందే చెప్పాయి మరియు కొన్ని తీర్పువైపు తిరిగి చూస్తాయి). ఆ సంస్కృతి యొక్క విగ్రహారాధన మరియు దానియేలు నమ్మకమైన స్వచ్ఛతకు మధ్య వ్యత్యాసం కావచ్చు లేదా గర్వము కలిగిన నెబుకద్నెజరు మరియు ముఖాముఖిగా దేవునిచేత అతను అణపబడటం మధ్య వ్యత్యాసమైనా కావచ్చు, ఏదియేమైనను దానియేలులోని అన్యమత నేపథ్యం ప్రభువు యొక్క శక్తిని అద్భుతమైన మరియు గంభీరమైన మార్గంలో ప్రకాశించుచు లేఖనాల్లో చూపిస్తుంది. అన్నీ పోగొట్టుకున్నట్లు అనిపించి పాపం యొక్క పరిణామాలు ఓడించివేస్తున్నప్పటికీ, నిజమైన దేవుడు భూమ్యాకాశములపైన సర్వాధిపతియై ఉన్నాడని దానియేలు పుస్తకం స్పష్టం చేస్తుంది (దానియేలు 4:17).

దానియేలు యొక్క ఉద్దేశమేమిటి?

పాత నిబంధనలో దానియేలు పుస్తకం ఒక ప్రత్యేకమైన మిశ్రమంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇది చరిత్రతో మొదలై, 7 వ అధ్యాయంలో బలమైన పరివర్తన చెంది, యూదులకు ముఖ్యమైన భవిష్యత్తు సంఘటనల దర్శనాలు కలిగియున్నది. ప్రత్యేకించి, దానియేలు 9:24–27 ఇశ్రాయేలు యొక్క మెస్సీయ ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు మరియు ఆ తరువాత జరిగే సంఘటనల గురించి ఖచ్చితమైన కాలక్రమం ఇస్తుంది.

చారిత్రక మరియు ప్రవచనాత్మక విభాగాలలో, విదేశీ శక్తుల ప్రభావం పెరుగుతున్నప్పటికీ, దేవుని సంపూర్ణ సార్వభౌమాధికారమును గూర్చి దానియేలు ఒక బలమైన ఉదాహరణను కనబరచాడు. సార్వభౌమాధికారం యొక్క ఇతివృత్తం సింహాల గుహ నుండి దానియేలు విముక్తి, మండుతున్న కొలిమి నుండి అతని స్నేహితుల రక్షణ, మరియు తన ప్రజలను చెడు శక్తుల నుండి రక్షించడానికి మహా వృద్ధుని యొక్క భవిష్యత్తు రాకతో సహా అనేక సందర్భాల్లో సంభవిస్తుంది (దానియేలు 3:23 –30; 6:19–23; 7:9–22).

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

దానియేలు, అలాగే దేవునికి భయపడే అతని స్నేహితులు ఇంటి నుండి మరియు ప్రభువు వారికి వాగ్దానం చేసిన దేశమునకు దూరంగా బబులోనులో నివసించవలసి వచ్చింది. తరువాత పుస్తకంలో, వాగ్దాన దేశంలో ఇంకా భయంకరమైన శ్రమలను గురించి దానియేలు ప్రవచించాడు (దానియేలు 11:31). శ్రమ ఏదైనప్పటికీ, ఇది ఎల్లప్పుడూ పాపమునకు ఫలితమే.

పాపపు బరువు లేదా పరిణామాలను మీరు ఎప్పుడైనా భరించారా, అలాగే మీ ఇంటితో సంబంధం కలిగియున్న సుఖాల నుండి ఎక్కడికో సుదూర లోకములోనికి నిస్సహాయస్థితిలో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టినట్లుగా భావించారా? అటువంటి ప్రపంచం నడుమ దేవుణ్ణి ఎలా నమ్మకంగా సేవించాలో, మనలను కృంగదీసే సమస్యలకు తక్షణ పరిష్కారాలు లేకున్నను నిరీక్షణతో ఎలా పట్టుదల కలిగియుండాలో దాని గురించి దానియేలు పుస్తకం వర్ణించింది.