కొలొస్సయులకు

ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?

పౌలు కొలొస్సైలోని క్రైస్తవులకు ఈ పత్రిక రాసే ముందు, అతను వారి నగరానికి అంతకుముందు వెళ్ళనేలేదు (కొలొస్సయులకు 2:1). అందుకే పత్రిక చివరలో అతను వ్యక్తిగత శుభాకాంక్షలను చేర్చాడు. ఈ పద్ధతి అతను సాధారణంగా సందర్శించని సంఘములకు వ్రాసే పత్రికలకు కేటాయించాడు (ఉదాహరణకు, రోమీయులకు వ్రాసిన పత్రిక). పౌలు తన అపొస్తలత్వపు అధికారం గురించి నొక్కిచెప్పడానికి ఒక నగరం నుండి ఇంకొక నగరానికి వెళ్ళడం కంటే, ఏ ప్రజలకైతే బోధించి సేవ చేయాలని భావించాడో అటువంటి వారితో వ్యక్తిగత సంబంధాలను పెంచుకోవటానికి ప్రయత్నించాడు. ఈ పత్రిక ముగింపులో కొలొస్సై విశ్వాసులతో మరింత వ్యక్తిగత స్వరముతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే కొలొస్సై సంఘములోనికి అక్రమంగా ప్రవేశించిన అబద్ధ బోధకులను ఖండించడానికే పౌలు ఈ పత్రికను రాసాడు.

మనమెక్కడ ఉన్నాము?

క్రీ.శ. 60-61 లో, రోమా‌లో తన మొదటి జైలు శిక్ష సమయంలో, పౌలు ఈ పత్రికను కొలొస్సై సంఘానికి రాశాడు, వారు క్రీస్తు యొక్క స్వభావము మరియు కార్యమును గూర్చిన అబద్ధ బోధతో పోరాడుచున్నారని ఒక నివేదిక వచ్చింది. ఈ నివేదిక ఎపఫ్రా నుండి వచ్చింది. ఇతను బహుశా కొలొస్సైలోని సంఘ నాయకుడును మరియు ఎఫెసులోని తన రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలవ్యవధి కలిగిన పరిచర్యలో పౌలు ద్వారా మారుమనస్సు పొందిన వ్యక్తియై ఉంటాడు. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో పౌలుకు ఎంతోకొంత సేవ చేయడానికి ఎపఫ్రా రోమా‌కు వచ్చాడు (ఫిలేమోనుకు 1:23), అంతేగాక కొలొస్సయులు వింటున్న ప్రమాదకరమైన బోధనల గురించి పౌలు అధీనము చేయడానికి వచ్చాడు. కాబట్టి పౌలు ఈ పత్రికతోపాటు ఫిలేమోనుకు, ఎఫెసీయులకు పత్రికలను తుకికుతో పాటు పంపాడు,ఒనేసిము కూడా ఉన్నాడు (కొలొస్సయులకు 4:7; ఫిలేమోనుకు 1:10–12). తుకికు పౌలు యొక్క తోటిపనివాడు, కొలొస్సై విశ్వాసులు అపొస్తలుని పత్రికలోని బోధలను అర్థం చేసుకోవడానికి మరియు వర్తింపజేసుకోవడానికి సహాయం చేయగలిగాడు.

కొలొస్సయులకు వ్రాసిన పత్రిక ఎందుకంత ముఖ్యమైనది?

కొలొస్సైలోని సంఘము యేసు యొక్క దైవత్వమును కించపరిచే తప్పుడు బోధకుల నుండి దాడికి గురైంది; ఆయన నిజముగా దేవుడు కాడని వారు బోధిస్తున్నారు. పౌలు ఎప్పుడూ ఈ సంఘానికి వెళ్ళనప్పటికీ, అతను ఈ సమస్యలను ప్రతిఘటిస్తూ సంబోధించాడు. సృష్టికర్తగా మరియు విమోచకుడిగా యేసుక్రీస్తు స్వభావం మార్చలేనిది, కాబట్టి ఈ కష్టమైన మరియు ఆయాసకరమైన పరిస్థితిలో తనకివ్వబడిన జ్ఞానముచేత ప్రభావము చూపేందుకు పౌలు వారికి రాశాడు. ఈ సంఘము తప్పుడు బోధకులు ఇచ్చిన లోపభూయిష్ట దృక్పథంలో కాకుండా దేవుడిని ఆయన మహిమాప్రభావములందు తెలుసుకోవడం అతనికి ప్రధానమైనది (కొలొస్సయులకు 1:25; 2:1-2).

కొలొస్సయులకు వ్రాసిన పత్రిక యొక్క ఉద్దేశమేమిటి?

ఈ పుస్తకంలో, అపొస్తలుడైన పౌలు యేసును క్రొత్త నిబంధనంతటిలో ఎంతో ఉన్నతమైన భాషతో వర్ణించాడు, క్రీస్తు యొక్క ప్రాముఖ్యత మరియు అన్ని విషయాలలో సమృద్ధిపై దృష్టి పెట్టాడు. పౌలు క్రీస్తును విశ్వ కేంద్రంగా, క్రియాశీల సృష్టికర్తగా మాత్రమే కాకుండా, మానవ శరీరాన్ని ధరించుకోవడంతో సృష్టిని పొందుకునేవాడుగా కూడా చూపించాడు. క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపియైయుండి, ఆయనే దేవత్వము యొక్క సర్వపరిపూర్ణతను కలిగి ఉన్నాడు (కొలొస్సయులకు 2:9). తన దైవిక స్వభావం కారణంగా, యేసు సార్వభౌమాధికారి, అన్నిటిపై అధికారం తండ్రి చేత ఆయనకు ఇవ్వబడింది. అందుకని, యేసు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఆయన సిలువపై తన మరణం ద్వారా అన్నిటినీ తనతో సమాధానపరచుకున్నాడు, విశ్వాసులను దేవునికి సజీవులుగా మార్చాడు. అలాగే వారిని సరైన జీవన మార్గంలో ఉంచాడు. క్రీస్తును గూర్చిన ఈ సరైన దృక్పథం కొలొస్సైలోని తప్పుడు బోధకు విరుగుడుగాను, అలాగే అప్పడు మరియు ఇప్పుడు క్రైస్తవ జీవితానికి మరియు సిద్ధాంతానికి ఒక కట్టడమువలె ఉపయోగపడింది.

నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?

యేసుక్రీస్తు గురించి మీ అభిప్రాయం మీ జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుంది. నేడు చాలామంది జీవించడానికి ఆచరణీయమైన సూచన మరియు సహాయాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. సిద్ధాంతం మరియు వేదాంతశాస్త్రం వంటి “నిగూఢమైన” విషయాలను విడిచిపెట్టేశారు, ఎందుకంటే వారు తమ రోజువారీ వాస్తవికతతో సంబంధం కలిగిలేరు. పౌలు అభిప్రాయం భిన్నంగా ఉంది. కొలొస్సై సంఘములోని క్రీస్తు స్వభావము మరియు కార్యము గూర్చిన సమస్యలకు ఆచరణీయమైన ప్రాముఖ్యత ఉందని ఆయన చూశారు. విశ్వాసులు క్రీస్తుతో కూడా మరణించారు; కాబట్టి, మన పాపముల విషయమై మనం చనిపోవాలి. మనము క్రీస్తుతో కూడా లేపబడ్డాము; అందువల్ల, మనం ఆయనలో బాగా జీవించాలి మరియు క్రైస్తవ ప్రేమచేత ప్రేరేపించబడిన లక్షణాలను ధరించుకోవాలి. మరియు ఆయన అందరికీ ప్రభువు కాబట్టి, క్రైస్తవుడి జీవితం యేసుకు లోబడే జీవితము. మీరు యేసును వెంబడించవలసిన విధముగా వెంబడిస్తున్నారా? యేసుక్రీస్తునందు మన విశ్వాసం మన జీవితంలోని ప్రతి రంగములో-మన ఇళ్లలో, మన సంఘాలలో మరియు మన లోకంలో ఉన్న సంబంధాలను మార్చివేయాలి.