ఈ పుస్తకాన్ని వ్రాసినదెవరు?
యెరూషలేముకు దక్షిణాన పది మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణమైన తెకోవలోని పసుల కాపరుల సమూహంలో ఆమోసు ప్రవక్త నివసించాడు. తాను ప్రవక్తల కుటుంబం నుండి రాలేదని, తనను తాను ఒక ప్రవక్తగా కూడా పరిగణించుకోవటంలేదని ఆమోసు తన రచనలలో స్పష్టం చేశాడు. అయితే, అతను "మేడి పండ్లు ఏరుకొనువాడును" మరియు పసుల కాపరి (ఆమోసు 7: 14-15). లోకంలోని అణగారినవారిపట్ల మరియు గొంతు వినిపించలేనివారిపట్ల దయ చూపించినందున, ప్రజల యొక్క నిరాడంబర జీవితానికి ఆమోసు యొక్క సంబంధం అతని ప్రవచనాలకు కేంద్రముగా నిలిచింది.
మనమెక్కడ ఉన్నాము?
క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దం యొక్క అర్థ భాగానికి వచ్చే ముందు, యూదా రాజైన ఉజ్జియా మరియు ఇశ్రాయేలు రాజైన యరొబాము పాలనలో ఆమోసు “భూకంపము కలుగుటకు రెండు సంవత్సరములు ముందు” (ఆమోసు 1: 1; జెకర్యా 14: 5 కూడా చూడండి) ప్రవచించాడు. వారి పాలనలు క్రీ.పూ. 767 నుండి క్రీ.పూ. 753 వరకు పదిహేను సంవత్సరాలు ఆవరించుకున్నాయి.
అతను దక్షిణ రాజ్యమైన యూదా నుండి వచ్చినప్పటికీ, ఆమోసు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు మరియు చుట్టుప్రక్కల దేశాలకు వ్యతిరేకంగా ప్రవచించాడు. ఇది గర్వముతో నిండిన ఇశ్రాయేలీయుల నుండి కొంత ప్రతిఘటనకు దారితీసింది (ఆమోసు 7: 12). యరొబాము పాలన ఉత్తర రాజ్యానికి భౌతిక కోణంలో చాలా లాభదాయకంగా ఉంది. ఏదేమైనా, ఆ సమయంలో సంభవించిన నైతిక క్షయమనేది భౌతిక ఎదుగుదల నుండి కలిగిన సానుకూలతలను ప్రతిఘటించింది.
ఆమోసు ఎందుకంత ముఖ్యమైనది?
ఆమోసు విసుగు చెందాడు. చాలా మంది ప్రవక్తలు వారి ప్రవచనాలలో ఇశ్రాయేలు మరియు యూదాకు వ్యతిరేకంగా ప్రవచిస్తూనే అక్కడక్కడ విమోచన మరియు పునరుద్ధరణను గూర్చి ప్రవచింపగా, ఆమోసు తన ప్రవచనంలోని చివరి ఐదు వచనములను మాత్రమే ఓదార్పు కోసం వినియోగించాడు. దీనికి ముందు, తమ పొరుగువారిపై ప్రేమ లేనివారును, ఇతరులను దోచుకొనేవారును, తమ సొంత కార్యములను మాత్రమే చూచుకొనువారును అయిన ఇశ్రాయేలు యొక్క ఆధిక్యతగల ప్రజలకు వ్యతిరేకంగా ఆమోసు ద్వారా దేవుని వాక్కు బయలువెళ్ళినది.
ఇతర గ్రంథములన్నిటికంటే, ఆమోసు గ్రంథము దేవుని ప్రజలను ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించినందుకు జవాబుదారీగా నిలబెట్టింది. న్యాయం విషయమై దేవుని ఆలోచనను ప్రజలు పూర్తిగా స్వీకరించడంలో వైఫల్యము చెందడాన్ని ఇది పదేపదే ఎత్తి చూపుతుంది. వారు తమ వస్తువులకొరకై బీదలను అమ్మివేస్తున్నారు, దరిద్రులను దోచుకుంటున్నారు, దరిద్రులను బాధపెట్టుచున్నారు, మరియు పురుషులు స్త్రీలను అనైతికంగా ఉపయోగించుచున్నారు (ఆమోసు 2: 6–8; 3: 10; 4: 1; 5: 11–12; 8: 4–6). వారు తమ స్వంత ఆర్థిక విజయముపట్ల ఆసక్తి కలిగి, వారు తమ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో, ప్రజలు ఒకరినొకరు ఆదరించుకోవాలనే భావనను పోగొట్టుకొన్నారు; ఇశ్రాయేలు దేవుణ్ణి వారు మరచిపోయారని వారి జీవనశైలియే సాక్ష్యమివ్వటం చూసిన ఆమోసు వారిని మందలించాడు.
ఆమోసు యొక్క ఉద్దేశమేమిటి?
ఉత్తరాన ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దాదాపు సాటిలేని విజయాన్ని సాధిస్తుండగా, పాపము తక్కువగానున్న దక్షిణ దేశములోని తన యింటనుండి నిశ్శబ్దమైన గొర్రెల కాపరి మరియు రైతు ప్రయాణము సాగించి ఇశ్రాయేలీయులకు తీర్పు సందేశాన్ని తీసుకెళ్లాలని దేవుడు నిర్ణయించాడు. ఉత్తరాది ప్రజలు ఆమోసు యొక్క స్థితిని ఒక విదేశీయుడని చెప్పి తాము చేసిన అనేక పాపముల విషయమైన తన తీర్పు సందేశాన్ని అలక్ష్యం చేసారు.
వారి బాహ్య జీవితాలు విజయ కిరణాలతో మెరుస్తున్నప్పటికీ, వారి అంతర్గత జీవితాలు నైతిక క్షయం యొక్క గొయ్యిలో మునిగిపోయాయి. న్యాయం జరిగించడానికి, దయను ప్రేమించటానికి మరియు వినయంగా నడవడానికి అవకాశాలను వెతకడానికి బదులు, వారు తమ అహంకారం, విగ్రహారాధన, స్వనీతిని మరియు భౌతిక వాదాన్ని అవలంబించారు. తన ప్రజల కపట జీవితాలను దేవుడు పూర్తిగా అసహ్యించుకొనుచున్నాడని ఆమోసు ప్రకటించాడు (ఆమోసు 5: 21-24). పునరుద్ధరణ యొక్క క్లుప్త దృష్టితో అతని ప్రవచనం ముగుస్తుంది. ఈ ప్రవచనం కూడా ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుకు కాకుండా యూదాకు సూచించబడింది (9: 11-15).
నేను దీన్ని ఎలా వర్తింపజేయాలి?
అన్యాయం మన ప్రపంచమంతటా వ్యాపించియున్నది. అయినప్పటికీ క్రైస్తవులుగా మనం ప్రార్థన, ఉపదేశించడం మరియు బోధించడం వంటి “అతి ముఖ్యమైన” పని కోసం ఇతరుల బాధలను చూడక గ్రుడ్డివారముగా వ్యవహరిస్తాము. కానీ ఆమోసు గ్రంథము మనకు గుర్తుచేస్తున్నదేమంటే, ఆ పనులు, ఒక విశ్వాసి జీవితానికి నిస్సందేహంగా కేంద్రంగా ఉన్నప్పటికీ, మన స్వంత జీవితాలలో ఇతరులను ప్రేమించనప్పుడు, సేవ చేయనప్పుడు ఆ పనులు ప్రయోజనశూన్యమే. సేవకంటే ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వడమనే ఉచ్చులో కొన్ని సమయాల్లో మీరు పడటాన్ని మీరు కనుగొన్నారా?
ఆమోసు ప్రవచనం మన జీవితంలోని కోరికలను సరళీకృతం చేయాలి. ప్రార్థన మరియు సేవ, ఈ రెండింటిలో ఏదోయొకటి ఎంచుకునే బదులు, రెండూ తప్పనిసరి అని ఆమోసు గ్రంథము మనకు బోధిస్తుంది. దేవుడు క్రైస్తవులను తనతో సంబంధము కలిగియుండాలని మాత్రమేగాక, ఇతరులతో కూడా సంబంధాలు కలిగియుండాలని పిలుచుచున్నాడు. ఆయన యొక్క కనబడు సృష్టి కంటే అదృశ్య దేవుడిపైనే ఎక్కువ దృష్టి పెట్టే క్రైస్తవుల కోసం, ఆమోసు మనల్ని ముఖ్య విషయం వైపు త్రిప్పి, ఇక్కడ దేవుని న్యాయ పథకంలో ప్రజల శారీరక మరియు ఆత్మీయ అవసరాలు ముఖ్యమైనవని తెలియజేసాడు.